"Jnapakam" a short story

"Jnapakam" a short story

నా పేరు చంద్ర సూర్యబట్ల..ఇదేంటి వింత పేరు అని ఆశ్చర్య పోతున్నారా?

1 year ago | By Harsha Pagilla

నా పేరు చంద్ర సూర్యబట్ల..ఇదేంటి వింత పేరు అని ఆశ్చర్య పోతున్నారా? అది కాదండి నా పేరు చంద్ర, సుర్యబట్ల అనేది మా ఇంటి పేరు.. ఇంటి పేరు అనగానే మా ఇంట్లో అమ్మా , నాన్నా , అక్కా ,చెల్లి ,అన్నయ్య ,తమ్ముడు ఇలా అందరు ఉంటారు అనుకున్నరా!!అలా ఎవరూ లేరండి నాకు...నేనొక అనాధని..చిన్నప్పుడే మా ఇంట్లో వాళ్ళంతా తీర్ధయాత్రలకు అని వెళ్ళి యాక్సిడెంట్లో చనిపోయారు.వాళ్ళు పోయి ఇంటొ పేరు మాత్రం నాకు మిగిలింది..


చిన్నప్పటి నుండి ఒంటరిగా పెరగడం వళ్ళ నాకు పుస్తకాల మీద ఇస్టం ఏర్పడింది..పుస్తకాలు అంటే చదువుకు సంబందించినవి కాదండి..నోవల్స్,చిన్న కథలు,పెద్ద కథలు ఇలా ఏది కనపడితే అవి చదివేవాడిని..వాటితో గడపడం వళ్ళ నేనెవరితోను అంత ఎక్కువ మాట్లాడే వాణ్ణి కాదు..నా లోకం నాదే...


ఇలా చదువుతున్న నాకు ఒక రోజు ఒక పుస్తకం కనపడింది.ఆ పుస్తకం ఒక గోస్ట్ నోవల్, అది చదువుతున్నంత సేపు చాలా ఆసక్తిగా అనిపించింది కాని చదివేసాక నిజంగా దెయ్యాలు ఉంటాయా అన్న అనుమానం నాలో మొదలైంది..వాటి గురించి అందరికంటే ఎక్కువ తెలుసుకోవాలని చాలా కష్టపడ్డాను..దెయ్యాన్ని చూసానని చెప్పిన ప్రతి ఒక్కరితో మాట్లాడాను, వాళ్ళు చెప్పే విషయాలు చాలా వరకు ఒకేలా ఉండేవి..దెయ్యం చూడగానే పెద్దగా గాలి వీచిందని,మంటలు ఎక్కడినుండి వచ్చాయో తెలీదు తెగ చెలరేగి పొయాయని చెప్తుండేవాళ్ళు...అవి విన్న ప్రతిసారి నాకొక ప్రశ్న అడగాలి అనిపించేది వాళ్ళని..అదేంటంటే దెయ్యాలు అంటే దుష్ట శక్తి అంటారు కాని ఆకాశం,భూమి,నిప్పు,గాలి,నీరు ఇవి పంచభూతాలు,వీటిని దేవుళ్ళుగా మనం భావిస్తాం మరి ఆ దెయ్యాలకి దేవుళ్ళు ఎందుకు సాయం చేస్తున్నారు? నాకైతే అర్దమయ్యేది కాదు....


వాళ్లు చెప్పిందంతా విని అక్కడి నుండి వచ్చేవాడిని..ఎందుకో వాళ్లు చెప్పిందంతా అబద్దమనిపించేది..రోజు రొజుకి దెయ్యలు ఉన్నాయన్న నమ్మకం నాలో తగ్గిపోతోంది.కాని కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన వళ్ళ ఆ నమ్మకం బలపడింది..అదేంటో మీకిప్పుడు చెప్పబోతున్నాను..


ఆ రోజు ఆదివారం అమావాస్య..చిన్ను ఈ రోజు బయట తిరగకూడదు మంచిదికాదు ఇంట్లోకొచ్చేయ్ అని చిన్నప్పుడు మా అమ్మ చెప్పే మాటలు గుర్తొచ్చాయి..సాయంత్ర 6 గంటలు దాటితే ఆ రోజు బయటకి వెళ్ళనిచ్చేది కాదు..ఆ రోజులు గుర్తొచ్చి ఒక వంతు ఆనందం మూడు వంతులు బాధ వేసింది..వాళ్ళు ఇక లేరు అనే బాధ ఆనందాన్ని దూరం చేసింది,సర్లేండి నా బాధలు ఎంత సేపని చెప్తాను..ఆ రోజు ఏం జరిగిందంటే..


సరిగ్గా 6.07 అయ్యింది సమయం..ఆ రోజు ఏంటో అంతా కొత్తగా ఉంది.వేసవి కాలం సూర్యుడు ప్రతాపం చూపించే మే నెల అది..అలాంటిది ఆ రోజు వరుణుడు సూరుణ్ణి తన మేఘాలతో కప్పేసి తన సైన్యాన్ని దండెత్తడం ప్రారంభించాడు.అలాజోరున వర్షం కురుస్తుంటే సాయంత్రం ఆరు గంటలే రాత్రి పది గంటలు తలపిస్తోంది.పైగా నిప్పుకి గాలి తోడైనట్టు కరెంట్ కూడా పోయింది.నా ఇల్లు జనసంచారానికి ఆమడ దూరం ఉండటం వల్ల ఆ చీకట్లో నా దీపం వెలుగు తప్ప ఇంకేం కనబటం లేదు.నేను నా వరండాలో కూర్చోని కాఫీ తాగుతూ వర్షాన్ని ఆస్వాదిస్తున్న..అలా వెళ్ళి డోర్ మూసి నా పడక కుర్చీలో కూర్చున్నాను..అంతా నిశబ్దం అది నాకు అలవాటే అనుకోండి,అందుకే ఎమి జరగనట్టు రేడియోలో పాటలు పెడదామని లేచాను..ఇంతలో నా నిశబ్ధం భగ్నం చేస్తు తలుపు శబ్దం ఠంగున మోగింది..అందరికి నిశబ్దం అంటే బయO కాని నాకు ఆరోజు ఆ శబ్దానికి భయమేసింది.


ఎప్పుడూ లేని విధంగా ఏంటా నా డోర్ కొడుతున్నారు అని ఆశ్చర్యం కలిగింది. వెళ్లి డోర్ ఓపెన్ చేసాను. ఎదురుగా ఒక మనిషి ఆకారం కనిపిస్తోంది. ఎత్తు 5'4" తెలుస్తోంది. కాని వచ్చింది ఆడో మగో అర్థం కావట్లేదు . " బయట వర్షం చాలా ఎక్కువ పడుతోంది, తగ్గేదాకా వరండా లో ఉండచ్చా ?" అని అమ్మాయి గొంతు వినిపించింది. ఒక మనిషి ఎలాంటివాడో వాళ్ళ మాట తీరు తో చెప్పేయొచ్చు అని పెద్దలు అన్నారు. ఆ అమ్మాయి మాట్లాడిన దాని బట్టి తను మరియాదస్తురాలు అని అనిపించింది. మొహం చూడకుండానే తనపై అభిమానం ఏర్పడింది.


"excuse me, నేను ఉండచ్చా?" అని తన మాటలతో మళ్లీ ఈ లోకానికి వచ్చాను.


"అయ్యో సారి బయట చలి గా ఉంది లోపలికి రండి ప్లీజ్" అన్నాను. తను రావాలా? వద్ద? అని సంకోచిస్తోంది అనుకుంటా.


"నన్ను చూసి భయపడకండి నేను ఎం చెయ్యను" అని నవ్వుతూ అన్నాను.


"అలా ఏO కాదండి, మీకు ఇబ్బంది కలిగించడం ఎందుకని ఆలోచిస్తున్నాను."


మనకి నచ్చిన వాళ్ళు కొంచం మంచిగా మాట్లాడినా ఏంతో బా అనిపిస్తుంది.  అలాంటిది ఇంత మర్యాదగా మాట్లాడే తనని చూస్తుంటే నాకు తెగ నచ్చేస్తోంది.


"ఇబ్బందేం లేదండి. మీరు లోపలికి రండి. ఐనా ఈ ఇంట్లో నేను తప్ప ఇంకెవరూ ఉండరు." ఆ మాట అనగానే తను వేస్తున్న అడుగు కాస్తా వెనక్కీ తీస్కుంది....  


"ఏంటండి ఒక్కడినే  ఉన్నంత మాత్రానా చెడ్దొన్నా? ఒక పది మంది ఉంటేనే మంచోడు అవ్తాడా మనిషి." తను ఏమి మాట్లాడలేదు మౌనంగా ఉంది.


"ఒకే నండి మీ ఇష్టం అయితేనే లోపలికి రండి, లేక పొతే ఒక దుప్పటి టవల్ తెస్తాను ఇక్కడే ఉండండి" అని లోపలి వెళ్ళాను, తీరిగి హాల్లోకి రాగానే తను సోఫా దెగ్గర వణుకుతూ నిల్చుంది. అది చూడగానే నా గుండె తరుక్కు పోయింది. వెంటనే నా చేతిలో ఉన్న టవల్ తనకు అందించాను.


అలా వణుకుతున్న తనను చూడలేక కిచెన్ లోకి వెళ్లి వేడి కాఫీ రెండు కప్పులు తీస్కోచాను. వాటిని చూడగానే వద్దు అని చెప్పబోతోంది నేను ఒక కప్పు ని తనకి అందించేసాను. కొద్ది సేపు ఆలోచించి తను కాఫీ తాగడం ప్రారంభించింది. తను వచ్చి పది నిముషాలు అయ్యింది. కాని ఇంకా తన మొహం నేను చూడలేదు. వచ్చిన దెగ్గర నుండి తల దించుకునే ఉంది. రూం లో ఉన్న కాండిల్ లైట్ సరిపోవట్లేదు. అందుకే టీపాయ్ మీద ఉన్న ఇంకో కాండిల్ వేలేగించి అలా తన వైపు చూసాను. 


నాకు వయసు వచ్చిన దేగ్గరినుంచి ఏ  అమ్మాయి వంక నేను చూడలేదు. రచయితలు, కవులు అమ్మాయిల గురించి, వాళ్ళ అందం గురించి పుస్తకాల్లో ఎంతో  అందంగా, అద్ద్భుతంగా రాసేవాళ్ళు. కాని వాళ్ళు రాసేదంతా అబద్ధమేమో. అనుకునే వాడిని. కాని ఇప్పుడు, తనని చూసాక వాళ్ళు రాసిందంతా తక్కువేమో అనిపించింది. దీపం వెలుగులో కనిపించేది కొంచమే అయినా, తన అందం వెయ్యి దీపాలు తలపిస్తుంది. వేడి వేడి పొగలు కక్కుతున్న కాఫీ కప్పుని తన ఎర్రటి పెదాలు తాకుతుంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేస్కుందో ఆ కప్పు అని అనుకున్నాను. నాకు ప్రతి చిన్న విషయం చాల స్పష్టంగా కనిపిస్తోంది, వినిపిస్తోంది. గోడ మీద ఉన్న గడియారం చప్పుడు, వర్షపు చినుకల హోరు, ఇవే కాదు తన తడి కురుల నుండి కారే నీటి బిందువులు కూడా ఎంతో స్పష్టంగా ఉన్నాయ్. ఇంత  వరకు ఎవరిని చూసి అంతగా మైమరిచి పోలేదు. ఇంతగా ఆరాధించలేదు కూడా. నా ఆలోచనలకు కళ్ళెం వేస్తూ తన కంఠం ఠంగున మోగింది. 


"హాయ్ నా పేరు అలేఖ్య".


"హలో నాపేరు చంద్ర" అని నన్ను నేను పరిచయం చేస్కున్నాను.


"మీరు చేసిన హెల్ప్ కి ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు."

"నేను అంత పెద్ద సాయం ఏం చేశాను అండి. జస్ట్ ఇంట్లోకి రమన్నాను. దానికే అంట పెద్ద మాటలా." అని నవ్వుతూ అన్నాను. తను నవ్వింది. ఆ నవ్వుని వర్ణించడం కంటే అనుభవించడమే మంచిదని తనని చూస్తూ ఉంది పోయాను. నేను అలా చూస్తుంటే ఏమనుకుందో ఏమో.


"ఇంట్లో మీరొక్కరే ఉంటారా?" అని అన్నది.


"అవునండి చిన్నప్పుడే అమ్మ, నాన్న రోడ్ యాక్సిడేంట్లో పోయారు. అప్పట్నుండి ఒంటరి గానే ఉంటుంది." మళ్లి కాసేపు మౌనం. ఈ నిశ్శబ్దం అనేది చాల భయంకరమైనది. ఏ మనిషినైనా ఎటువంటి సౌండ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇది భయపెట్టగలదు. 


"ఐ యాం వేరి సారి" అని తన సానుభూతిని వ్యక్తం చేసింది. నేనూ అలానే నవ్వాను. కొన్ని నిముషాల వరకు ఏవేవో కబుర్లు, నవ్వులు నడుస్తున్నాయి. వచ్చినప్పుడు తన కళ్ళల్లో ఉన్న బెరుకు, భయం ఇప్పుడు నాకు కనిపించలేదు. 


"మీరు ఒక్కరే  ఎలా ఉంటున్నారు ఇక్కడ భయం వెయ్యదా మీకు ?"


"మీ అమ్మని చూస్తె మీకు భయం వేస్తుందా ?"


"అమ్మని చూస్తే భయం ఏంటండి ?"


"ఇది కూడా  అంతే  ఈ ఇళ్ళు  నాకు అమ్మ లాంటిది ,మా అమ్మ కంటే ఎక్కువ రోజులు  నన్నీ  ఇళ్ళు  చూస్కుంది అందుకే నాకసలు భయం వెయ్యదు ."


"మా బాగా మాట్లాడుతున్నారు , ఏం చదువుకున్నారు?"


"చాలా చదివాను చదువుని కాదు జీవితాన్ని ."


తను నవ్వింది, మనకి ఎవరైనా నచ్చితే వాళ్ళేం  చేసినా మనకి నచ్చుతుంది, ఇది చదివినప్పుడు ఎందుకిన్తలా ఎక్కువగా రాస్తారు అని నేను అనుకునేవాడిని కాని అది నిజమని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది.


వర్షం తగ్గుముకం పట్టింది, చిన్న చిన్న తుంపర్లు పడుతున్నాయి. వర్షం ఆగితే ఎక్కడ తను వెళ్ళిపోతుందో అన్న భయం మొదలైంది...


" వర్షం తగ్గింది అనుకుంటా, ఇక నేను వెళ్తానండి ". ఈ మాటతో నా గుండె ఆగినంత పనైంది.తను వెళ్ళిపోతానంటె ఆపే అర్హత, అధికారం రెండు నాకు లేవు.కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టి తన జుట్టు సరిచేసుకుంటోంది..తను వెళ్ళకుండా ఉండాలంటే ఏం చెయ్యలా అని నా మైండ్ ఆలోచిస్తోంది.ఎన్నో నోవల్స్, పుస్తకాలు చదివాను గాని ఎక్కడా ఈ పరిస్తితికి పరిష్కారం దొరకడం లేదు. ఆ ఊహలకి నిజాలకి ఎంత దూరం ఉందో ఇప్పుడు అర్దమవుతోంది ... 


తను వెళ్ళిపోతోంది అన్న నిజం గుర్తొచ్చి మళ్ళీ ఈ లోకానికి తిరిగొచ్చాను..తను కళ్ళలో ఎదో తెలియని సంతృప్తి కనపడింది, కాని దాని అంతరార్దం అర్దంకాలేదు..నా వైపు చూసి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతోంది..


"ఒక్క నిముషం". అని అనడంతో వెనక్కి తిరిగింది..అ పదాలు ఎలా వచ్చాయో నాకు అర్దం కాలేదు..కాని తనతో ఒక్క నిముషం ఎక్కువ గడుపుతున్నానని  ఆనందం వేసింది.."చెప్పండి" అని తను అనింది..ఇక చెప్పేద్దాం అనుకున్నాను ..ఫేయిల్ అవుతుందని మీరు అనుకోవచ్చు..కాని ఇన్ని సంవత్సరాలలో నాకు వచ్చిన ఎకైక అవకాశం, దాన్ని ఎలా వదిలేస్తాను చెప్పండి..


" ఇది మీకు వింతగా అనిపించొచ్చు కాని ఒక్కసారి నేను చెప్పేదాని గురించి ఆలోచించండి చాలు,ఇందాక మీరొక విషయం అడిగారు గుర్తుందా? ఇంట్లో ఒక్కడే ఉంటారు భయం వెయ్యదా? అని అప్పుడు నేను అబద్దం చెప్పాను..అవ్నండీ ఇప్పుడు వేస్తోంది , మీరు వచ్చాక నాకు ఈ ఇళ్ళు చాలా కొత్తగా అనిపించింది, కాని ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు అంటే మళ్ళీ ఆ ఒంటరి తనం అంటే భయం వేస్తోంది..60 నిమిషాలు కలిసుంటే ప్రేమేంటి అని మీరు అనుకోవచ్చు కాని నా జీవితంలో నాకు ఊహ తెలిసిన దెగ్గరినుండి నేను ప్రేమను చూసింది ఆ 60 నిమిషాలు మాత్రమే.


ఇన్ని రోజులు ఒంటరితనం అంటే ఒక వరంలా భావించాను కాని అది ఒక శాపం అని ఇప్పుడిప్పుడే నాకర్దమవ్తోంది..ఫైనల్ గా ఒకటి చెప్తాను, మీకు మీ కుటుంబం, చదువు, ఫ్రెండ్స్ ఇలా ఎన్నో ఉండొచ్చు కాని నాకు ఈ ఇళ్ళే లోకం. ఈ ఇంటి మీద ప్రమాణం చేసి చెప్తున్న, ఈ ఇంట్లో మీరు కన్నీటి చుక్క కార్చరు ".. 


60 నిమిషల క్రితం వరకు నాకు ఎంతో నచ్చే నిశబ్దం ఇప్పుడు అసలు ఎందుకు భూమ్మీద ఉందా అని తిట్టుకున్నాను..తను ఏమి మాట్లాడలేదు.. మోనం అర్డంగికారం అన్నారు కాని మరో సగం నన్ను వద్దనుకుంటోంది అనుకుంటేనే భరించలేకపోతున్నాను..పది నిమిషాలు గడిచింది తన వైపు చూడాలంటేనే భయం వేస్తోంది ఎక్కడ నన్ను చీదరించుకుంటోందో అని, ఒకసారి చూద్దామని చూసాను, తన కళ్ళలో నీళ్ళు, పెదాలపైన నవ్వు రెండు చాలా స్పష్టంగా నాకు కనబడుతోంది..


" ఇక నేను వెళ్తానండి " అన్న తన మాటలతో ఊటిలో డ్యూయెట్టు వేసుకుంటున్న నన్ను ఈ ఇంట్లోకి లాక్కొచ్చింది..తను నా ఇళ్లు దాటి వెళ్తుంటే చూస్తూ ఉండిపోయాను..ఏం చెయ్యాలో అర్దం కాలేదు వెంటనే కప్ బోర్డ్ వైపు వెళ్లి నిద్ర మాత్రలు బోటిల్ తీసాను..పది ట్యాబ్లెట్స్ చేతిలో తీసుకున్నాను .


తీసుకోవడం పది తీసుకున్నాను కాని వేస్కోడానికి మైండ్ ఒక్క ట్యాబ్లెట్కే పర్మీషన్ ఇచ్చింది..కాని ఈ గుండె అనేది ఒకటుంది చూడంది దాన్ని దేవుడు బ్లడ్ పంపింగ్ కోసం తయారు చెస్తే అది దాన్నొదిలేసి మిగతావాటి పైన శ్రద్దెక్కువ చూపిస్తోంది..శరీరాననంతా అదుపు చెసేది మైండ్ ఐతే ఇది దాన్ని గుపిట్లో పెట్టుకోవాలని దాని ఆశ..దాని ప్రయత్నాలు ఫలించకపోతే ఇదిగో ఇలా అర్డంతరంగా మిగతా వాటీని చంపెయ్యాలని చూస్తుంది..కొన్ని వేల మందిని అది ఇలా హత్య చేసి ఆత్మహత్య అని చెప్పుకొచ్చింది..కాని నా మైండ్ దాని ఆటలు సాగనివ్వలేదు..ఎక్కువ ఆలోచించకు ఈ రోజుకు బాధపడింది చాలు, బాధపడినంత మాత్రాన అమ్మాయి తిరిగిరాదు అని పడుకోపెట్టింది.ఎప్పుడు పడుకున్నానో తెలియదు కాని చాలా సేపు నిద్రపొయాను..   


దబ్ దబ్ అని శబ్దం మొదలైంది, ఎవరో తలుపు కొడుతున్నారు. కళ్ళు తెరిచాను, అప్పటీకే సూర్య భగవాణుడు చీకటిని దండెత్తి గెలిచాడు..ఆ తలుపు కొట్టేది అలేఖ్య అని గుండె కొట్టుకుంటోంది. ఇది కల కాదు నిజం అని మైండ్ లాగిక్లు తీస్తోంది..వీళ్ళిద్దరి గొడవ ఎప్పుడూ ఉండెదే అని తలుపు తెరవడానికి లేచాను.బెడ్ నుండీ తలుపికి పదిహేను మీటర్లు దూరం, ఈ పదిహేను మీటర్లలో తలుపుకి అటుపక్క తను ఉండాలని వంద సార్లు అనుకున్నాను..తలుపు తెరిచాను..వచ్చింది నా ఒక్కగానొక్క స్నేహితుడు అరవింద్..మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది సినిమా అవుతుంది  కాని.. 


" ఇంకా నిద్రలేవలేదా చందూ? " ఇలా నన్ను పిలిచే ఎకైక వ్యక్తివాడు..కాస్తో కూస్తో నా మంచి కోరుకునేది ఎవరైన ఉన్నాడంటే అది వీడే.."బాబు నాకంత టైం లేదు నేను వెళ్ళాక ఆ లోకనికెల్లొచ్చుగాని ఇప్పటికి ఈ లోకంలోనే ఉండు ."  అని నన్ను లాకోచ్చాడు..


" నైట్ లేట్ అయ్యిందిరా పడుకునే సరికి, నిద్ర పట్టలేదు."


" అది సరేకాని నిన్న నిన్ను కలవడానికి ఒక ఫ్యామిలీ పంపించాను వచ్చారా? " అని అరవింద్ అడిగాడు..


" ఏ ఫ్యామిలీ? అయినా నిన్న ఎవరూ రాలేదని చిన్న అబద్దం ఆడాను. ఎందుకంటే మొదలవకుండానే ఆగిపొయిన లవ్ స్టోరి చెప్పడం ఎందుకని..


" అదేరా నేను మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు పెళ్ళిలో ఒక ఫ్యామిలిని కలిసాను.. మేఘన వాళ్ళ చుట్టాలు, వాళ్ళ కూతిరి కోసం సంబంధం వెతకమన్నారు.నీ గురించి చెపితే వస్తాం అన్నారు అని మొన్న చెప్పాను కదా ?  “ 


మేఘన మా వాడి భర్య..వీళ్ళిద్దరే నాకు ఉన్న ఫ్యామిలి..ఈ విషయం మొన్న ఫోన్లో చెప్పాడు వస్తారు అని..పెద్ద ఫ్యామిలీ కదా అని నేను ఒకే చెప్పేసాను.పిళ్ళకి నా ఫోటో చూపించాడట, చూడగానే నచ్చేసానట, ఇలా కూడా అవుతుందా అని నవ్వుకున్నాను ఆ రోజు..కాని నిన్న అలేఖ్యని చూసాక అర్దమయ్యింది ఆ అమ్మయికి అలా నచ్చడంలో తప్పులేదని..


" ఎవరూ రాలేదురా, నిన్న వర్షం వళ్ళ ప్రొగ్రాం పోస్ట్ పోన్ చెస్కున్నారేమో.."


" లేదురా వాళ్ళు నిన్ను చూడటానికి మొన్ననే హైదరబాద్ వచ్చారు, సాయంత్రం బయలుదేరేటప్పుడు నాకు ఫోన్ చేసే బయలుదేరారు."


" ఏ టైంకి బయలుదేరారు ? "


" సరిగ్గా 6.07 కి అది రాహు కాలం వద్దు అని ఎంత చెప్పినా మాకు అలాంటివాటి మీద పట్టింపులేమి లేవు పది గంటలకి మళ్ళి వైజాగ్ వెళ్ళిపోవాలని చెప్పారు."  


నాకేం అర్డంవట్లేదు కొంపతీసి అలేఖ్య వళ్ళ అమ్మయేనా? అయినా అందరూ రాకుండా ఒంటరిగా తననెలా పంపారు ? అది కూద అంత ఘోర వర్షంలో.. మూగబోయిన గుండె మళ్ళీ కోట్టుకోవడం ప్రారంభించింది.. మొదటిసారి నేను కావాలి అనుకున్నది వెళ్ళిపోయి మళ్ళి తిరిగి రావడం..


" తన పేరేంటి అరవింద్?, అదే ఆ అమ్మయి పేరు.."


" అలేఖ్య " అని వాడు అనగానే ఇక నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది.ఇప్పుడర్దమైంది నేను ఎలాంటి వాణ్ణో  తెలుసుకోడానికి అలా చేసారని..తను వెళ్ళిపోయేటప్పుడు తన కళ్ళలో చూసిన మెరుపుకి కారణం అదే అని..


" ఆగు వాళ్ళకి కాల్ చేస్తా ఒకసారి" ప్రపంచంలో ఉన్న ఆనందమంతా నా చుట్టూ ఉన్న 250 sq.ft  ఇంట్లో ఉన్నట్టు అనిపించింది ..    


" రేయ్ రింగ్ అవ్తోంది కాని ఎవరూ లిఫ్ట్ చెయ్యట్లేదు. సర్లే నాకు ఫ్లైట్ టైం అవుతోంది, నేను మళ్ళీ వచ్చాక వాళ్ళని కాంటాక్ట్ చేద్దాం."


అలా అనుకోని ఇద్దరం బయటకి వచ్చాం. ఎప్పుడూ లేనిది నా ఇంటి దెగ్గర జనాలు గుమ్మికూడారు..


" ఏంట్రా ఆ జనాలు ? " అని అరవింద్  ని అడిగాను ..


" ఏమోరా ఇందాక లొపలికి వచ్చెటప్పుడు హడావిడిలో గమనించలేదు.."


" సర్లే నువెళ్ళు టైం అవ్తున్నట్టుంది .." అని అటువైపు నడిచాను..


దెగ్గరికి వెళ్తుండగానే అర్దమయిపోయింది ఏదో యాక్సిడెంట్ అని.. ఆ జనంలో నుండి లోపలికి వెళ్ళి చూసాను.. అయిదు శవాలు ఉన్నాయి.. వాటి మీద తెల్ల గుడ్డ కప్పారు..సరిగ్గా అప్పుడే పెద్దగా గాలి వీచింది..ఆ తెల్ల గుడ్డ ఎగిరిపోయింది..


" అలేఖ్య!!" ఇదొక్క పదంతోనే ఆగిపొయాను మాట రాలేదు....


" పాపం నిన్న సాయంత్రం 6.00 కే అయ్యిందంట, కాని ఎవరూ పట్టీంచుకోలేదు.." అని ఎవరో వెనక అన్నాడు..నా కళ్ళ నుండి నీళ్ళు రావడం మొదలయింది..మేఘాలు కమ్ముకున్నాయి...


Written By: Harsha Pagilla


0 Likes Comments Share

Sponsored Ads

Note: 9by10.com takes no responsibility for the content or accuracy of the above news articles. The news articles and posts do not represent 9by10's opinions nor can we guarantee that the reporting therein is completely factual. Please visit the source responsible for the item in question to report any concerns you may have regarding content or accuracy.

Sponsored Ads

Sponsored Ads